నేడు హైదరాబాద్‌కు ప్రధాని... ట్రాఫిక్ ఆంక్షలు

ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. కనుక నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్ళింపు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీస్ విభాగం తెలియజేసింది. 

ప్రధాని నరేంద్రమోడీ పర్యటన షెడ్యూల్: శుక్రవారం సాయంత్రం 4.40 గంటలకు ప్రత్యేక విమానంలో కేరళ నుంచి బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మీర్జాల్ గూడ చేరుకొని మల్కాజ్‌గిరి వరకు రోడ్ షో నిర్వహిస్తారు. రోడ్ షో ముగిసిన తర్వాత రాజ్‌భవన్‌ చేరుకొని అక్కడే రాత్రి బస చేస్తారు. 

శనివారం ఉదయం 10.40 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో నాగర్‌కర్నూల్‌ బయలుదేరుతారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ బీజేపీ అధ్వర్యంలో జరుగబోయే బహిరంగ సభలో పాల్గొన్నాక, మధ్యాహ్నం 2 గంటలకు అక్కడి నుంచే హెలికాఫ్టర్‌లో కర్ణాటకలోని గుల్బర్గాకు బయలుదేరి వెళ్ళి అక్కడ ఎన్నికల ప్రచారసభలో పాల్గొంటారు. 

మర్నాడు అంటే మార్చి 17వ తేదీన ఏపీలోని చిలుకలూరిపేటలో టిడిపి, జనసేన, బీజేపీల బహిరంగ సభలో పాల్గొంటారు. మార్చి 18వ తేదీన హైదరాబాద్‌ తిరిగివచ్చి తెలంగాణలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. ఆరోజు ప్రధాని పర్యటన షెడ్యూల్ ఇంకా వెలువడ వలసి ఉంది. ప్రధాని భద్రత దృష్ట్యా ఈరోజు (శుక్రవారం) సాయంత్రం, శనివారం ఉదయం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి, ప్రధాని పర్త్యటించబోయే కొన్ని ప్రాంతాలు, మార్గాలలో వాహనాలు వేరే మార్గాలకు మళ్ళించబోతున్నట్లు నగర ట్రాఫిక్ పోలీస్ విభాగం తెలియజేసింది.