కాంగ్రెస్‌లో చేరేందుకు మల్లారెడ్డి తిప్పలు

మాజీ మంత్రి మల్లారెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ వచ్చిన వార్తలను ఖండించినప్పటికీ ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు రహస్యంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే, తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని వెంటబెట్టుకొని బెంగళూరు వెళ్ళి అక్కడ ఓ హోటల్‌లో కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌తో భేటీ అయ్యారు.

తామిద్దరం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నామని కానీ, తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి చేర్చుకోవడానికి అయిష్టత వ్యక్తం చేశారని, కనుక శుక్రవారం ఢిల్లీలో ప్రియాంకా గాంధీని కలిసి పార్టీలో చేర్చుకోవలసిందిగా కోరేందుకు ఆమె అపాయింట్మెంట్ ఇప్పించాల్సిందిగా వారు కోరిన్నట్లు తెలుస్తోంది. 

గతంలో మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు రేవంత్‌ రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా ఉండేవారు. అప్పుడు రేవంత్‌ రెడ్డిని ఉద్దేశ్యించి మల్లారెడ్డి చాలా అనుచితంగా మాట్లాడారు. దమ్ముంటే నన్ను టచ్ చెయ్ అంటూ బూతులు తిడుతూ తొడకొట్టి మరీ సవాలు విసిరారు. 

ఇప్పుడు రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కనుక అందుకు ప్రతీకారం తీర్చుకున్నారు. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి దిండిగల్ వద్ద ప్రభుత్వ భూమి కబ్జా చేసిన భవనాలను రెవెన్యూ సిబ్బంది పాక్షికంగా కూల్చివేయడంతో మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని వెంటబెట్టుకొని పరుగున సిఎం రేవంత్‌ రెడ్డి సలహాదారు వేంరెడ్డిని కలిసి వేడుకోవడంతో కూల్చివేతలు నిలిచాయి.

ఆ దెబ్బతో మల్లారెడ్డి తన కొడుకు భద్రారెడ్డి లోక్‌సభ ఎన్నికలలో మల్కాజ్‌గిరి నుంచి పోటీ నుంచి విరమించుకున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత తన అక్రమస్తులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారంటూ వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఆయన ఖండించి మళ్ళీ బెంగళూరులో డికె శివ కుమార్‌ని కలిశారు. కనుక మల్లారెడ్డి అండ్ కో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమే అని భావించవచ్చు. కానీ రేవంత్‌ రెడ్డి అంగీకరించకపోతే వారి పరిస్థితి ఏమిటి? బీజేపీలో చేరిపోతారేమో?