వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఈరోజు ఉదయం హన్మకొండలోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడేందుకు సిద్దమవుతుండగా, బిఆర్ఎస్ ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వచ్చి ఆయనను తమ కారులో తీసుకుపోవడంతో కలకలం చెలరేగింది.
ఆయన బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్ళి ఆయనని కలిసి మాట్లాడారు. ఈరోజు ఉదయం తన నివాసం వద్ద తన అనుచరులతో చర్చించిన తర్వాత పార్టీ మారబోతున్నట్లు మీడియాకు చెప్పేందుకు సమావేశం ఏర్పాటు చేశారు.
ఆయన మీడియాతో చెప్పబోయేది వినేందుకు సిద్దంగా ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలో బస్వరాజు సారయ్య, ఎర్రబెల్లి దయాకర్ రావు హడావుడిగా అక్కడకు చేరుకొని ఆయనను లోనికి తీసుకువెళ్ళి మాట్లాడారు. పార్టీ మారవద్దని కేసీఆర్ తరపున చెప్పేందుకే తాము వచ్చామని, ఈరోజు సాయంత్రం హరీష్ రావు కూడా వచ్చి మిమ్మల్ని కలిసి మాట్లాడుతారని అంతవరకు ఓపిక పట్టాలని వారు అభ్యర్ధించిన్నట్లు ఆరూరి రమేష్ అనుచరులు చెప్పారు.
కానీ అందుకు ఆయన అంగీకరించకపోవడంతో, ఇంచుమించు బలవంతంగా వారు ఆయనను తమ కారులో ఎక్కించుకొని తీసుకుపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అనుచరులు మీడియాతో మాట్లాడుతూ, “గంటలోపుగా మా నాయకుడు వెనక్కు రాకపోతే హన్మకొండ పోలీస్ స్టేషన్‌లో బిఆర్ఎస్ నేతలపై కిడ్నాప్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.