తెలంగాణలో 12 ఎంపీ సీట్లు బీజేపీకే: అమిత్ షా

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీజేపీ ఓడిపోయినప్పటికీ లోక్‌సభ ఎన్నికలలో భారీగా సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది. బిఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు ముఖ్య నేతలను, ఎంపీలను బీజేపీలోకి ఆకర్షించి వారికి ఎంపీ టికెట్స్ ఇచ్చి, బిఆర్ఎస్ పార్టీకి వారిని ఎదుర్కోక తప్పని పరిస్థితి కల్పిస్తోంది. 

మంగళవారం హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎల్బీ స్టేడియంలో బూత్‌ స్థాయి నేతలు, కార్యకర్తలని ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “కాంగ్రెస్‌, బిఆర్ఎస్, మజ్లీస్‌ మూడు పార్టీలు ఒక్కటే. మూడింటి మద్య మిత్రత్వం, రహస్య అవగాహన ఉంది. కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలను మజ్లీస్‌ పార్టీయే శాశిస్తుంటుంది.  మూడూ కుటుంబ పార్టీలే. ఈ మూడు పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాలే చేస్తుంటాయి. తమ వారసుల సంక్షేమం గురించే ఆలోచిస్తుంటాయి తప్ప ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవు. 

కాంగ్రెస్ పార్టీ దేశంలో పదేళ్ళపాటు అధికారంలో ఉన్నప్పుడు 12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది. తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి కాదనగలరా? ఎన్నికలలో ఇచ్చిన ప్రతీ హామీని అమలుచేయగలమని చెప్పగలరా?

కానీ ప్రధాని నరేంద్రమోడీ అవినీతి రహితమైన పాలన సాగిస్తూ, దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారు. దశాబ్ధాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేయలేని అనేక పనులను ప్రధాని నరేంద్రమోడీ పదేళ్ళలో చేసి చూపుతున్నారు. కనుక ఈ అభివృద్ధి ఇలాగే నిరంతరం కొనసాగేందుకు తెలంగాణలో కనీసం 12 ఎంపీ సీట్లు గెలుచుకొని ప్రధాని నరేంద్రమోడీకి కానుకగా ఇవ్వాలి,” అని అమిత్ షా అన్నారు.