యాదాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

సోమవారం నుంచి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. తొలిరోజున అంకురార్పణ, విశ్వక్షేనపూజ, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. సిఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించుకున్నారు.    

11 రోజుల పాటు సాగే ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 21న జరిగే శృంగార డోలోత్సవంతో ముగుస్తాయి. ఈ 11 రోజులు ప్రతీరోజూ స్వామివారికి కళ్యాణాలు, నిత్య అర్జిత సేవలు, సుదర్శన నారసింహ హవన పూజలను, శాశ్విత మొక్కులను నిలిపివేసి బ్రహ్మోత్సవ ప్రత్యేక పూజలు, సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో రామకృపారావు తెలిపారు.

రేపు (బుధవారం) నుంచి ప్రతీరోజు స్వామివారికి ప్రత్యేక అలంకార సేవ, వాహన సేవ ఉంటుందని, మాడవీదులలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు.

ఈ నెల 17న స్వామివారి ఎదుర్కోలు, 18న తిరు కళ్యాణం, 19న స్వామివారి దివ్యా విమాన రధోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో రామకృపారావు తెలిపారు.