సోమవారం రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో భారత్లో పవిత్ర రంజాన్ మాసం మొదలైంది. రుయాత్ ఏ హిలాల్ కమిటీ ఈ విషయం ప్రకటించి నేటి నుంచి ఉపవాస దీక్షలు చేయవలసిందిగా ముస్లింలకు పిలుపునిచ్చింది. హైదరాబాద్లో మక్కా మసీదు, ముర్గీ చౌక్ వద్ద మసీదుతో సహా దేశవ్యాప్తంగా అన్ని మసీదులలో నేటి నుంచి ప్రత్యేక ప్రార్ధనలు మొదలయ్యాయి.
రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ముస్లిం ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణనిస్తుందన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాస వేడుకలను సుఖసంతోషాలతో జరుపుకోవాలని, ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని ఆకాంక్షించారని ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.