బిఆర్ఎస్ పార్టీతో పొత్తుకి మాయావతి అనుమతించారట!

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని కలిసి పోటీ చేసేందుకు మా పార్టీ అధినేత్రి మాయావతి అనుమతించారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్‌ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. కనుక త్వరలోనే బిఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌తో మరోసారి సమావేశమయ్యి సీట్ల సర్దుబాట్లపై చర్చిస్తామని తెలిపారు. 

ఈ పొత్తు వలన బిఆర్ఎస్‌ పార్టీకి కొత్తగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చు. కానీ బిఆర్ఎస్‌ పార్టీలో నుంచి బీజేపీలో చేరిన ఎంపీలను ఎదుర్కొనే ఇబ్బంది నుంచి బయటపడగలదు. ఆ సీట్లను బీఎస్పీకి అప్పగించేస్తే, వారి చేతిలో బీఎస్పీ అభ్యర్ధులు ఓడిపోయినా బిఆర్ఎస్ పార్టీ పరువు పోకుండా బయట పడగలుగుతుంది. లేదా ఒకవేళ బిఆర్ఎస్ అభ్యర్ధులే పోటీ చేసినా ప్రవీణ్ కుమార్‌ వారికి దళితుల మద్దతు కూడగట్టి గెలిచేందుకు తోడ్పడతారు. 

శాసనసభ ఎన్నికలలో ఘోరపరాజయం పాలైన బీఎస్పీ, ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఒక్క ఎంపీ సీటు గెలుచుకున్నా అది ఆస్కార్ అవార్డు వంటిదే అవుతుంది. ఆస్కార్ అవార్డు కోసం తెలంగాణ బీఎస్పీ ప్రయత్నిస్తుంటే మాయావతి వద్దంటారా? అనరు కనుక అనుమతిచ్చేశారు.

ఏది ఏమైనప్పటికీ, ఈ కొత్త పొత్తులతో బీఎస్పీ, బిఆర్ఎస్ ఎన్నికలలో గెలిచినా గెలవలేకపోయినా, రెండు పార్టీల పరువు కాపాడుకోవడానికి మాత్రం చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.