200 యూనిట్లలోపు బిల్లు కట్టొద్దు: భట్టి విక్రమార్క

ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీ నేతలు 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకున్నవారు బిల్లులు కట్టొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తుండేవారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వయంగా అదే మాట చెపుతున్నారు. శనివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “తెల్ల రేషన్ కార్డులు కలిగి, నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే వారికి విద్యుత్ శాఖ సిబ్బంది బిల్లులు ఇచ్చినప్పటికీ కట్టవద్దు. 

వెంటనే తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, విద్యుత్ బిల్లు వగైరా ఆధారాలతో సమీపంలోని మునిసిపల్, రెవెన్యూ లేదా విద్యుత్ కార్యాలయంలో సిబ్బందిని కలిసి, మీ వివరాలను నమోదు చేసుకున్నట్లయితే ఆ బిల్లుని రద్దు చేసి జీరో బిల్ ఇస్తారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 40,33,702 కుటుంబాలకు జీరో బిల్లులు ఇచ్చాము. మరో 45 వేల మందికి బిల్లులు వస్తే వాటిని రద్దు చేసి జీరో బిల్లులు ఇచ్చాము. కనుక 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడుకున్నా బిల్లు వచ్చిందని ఎవరూ ఆందోళన చెందనవసరం లేదు,” అని అన్నారు. 

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు హటాత్తుగా పెరిగిపోవడంతో ఈ నెల 8వ తేదీన 15,623 మెగావాట్స్ విద్యుత్ వినియోగం అయ్యింది. మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ విద్యుత్ కోతలు విధించకుండా 24 గంటలు నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.