కేంద్ర ఎన్నికల కమీషనర్ అరుణ్ గోయల్ శనివారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. దానిని వెంటనే రాష్ట్రపతి ఆమోదించారు. మరో నాలుగైదు రోజులలో కేంద్ర ఎన్నికల కమీషన్ లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించబోతోంది.
ఇదీగాక కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ రాజీవ్ కుమార్ 2025, ఫిబ్రవరిలో పదవీ విరమణ చేసిన తర్వాత అరుణ్ గోయల్ ఆ పదవిని చేపట్టే అవకాశం ఉంది. ఆ పదవిలో ఆయన డిసెంబర్ 2027వరకు కొనసాగవచ్చు.
కానీ ఆయన ఇవేమీ పట్టించుకోకుండా శనివారం సాయంత్రం హటాత్తుగా రాజీనామా చేయడం, కొన్ని గంటల వ్యవధిలోనే దానిని రాష్ట్రపతి ఆమోదించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
దీనిపై పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత మహువా మొయిత్రా, ఎంపీ సాకేత్ గోఖలే స్పందిస్తూ, “మొన్న కేంద్ర ఎన్నికల కమీషన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు కేంద్రం నుంచి వచ్చిన కొన్ని ఆదేశాలపై ఆయన అభ్యంతరం చెపుతూ సమావేశం మద్యలోనే వెళ్ళిపోయారు.
రాష్ట్రంలో ఎన్ని దశలలో పోలింగ్ నిర్వహించాలో, ఎంత మంది భద్రతసిబ్బందిని మోహరించాలో కేంద్ర ఎన్నికల కమీషన్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం హుకుం జారీ చేయడంతో ఆయన దానిని తప్పు పడుతూ సమావేశం మద్యలో బయటకు వెళ్ళిపోయారు.
కేంద్ర ఎన్నికల కమీషన్ వ్యవహారాలలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని ఖండిస్తూ తన పదవికి కూడా రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం వైఖరిని మేము కూడా ఖండిస్తున్నాము. ఇప్పుడు ఒక్క కమీషనర్‌తోనే కేంద్ర ఎన్నికల కమీషన్ లోక్‌సభ ఎన్నికలు నిర్వహించబోతోందా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా కేంద్ర ప్రభుత్వం తీరుని తప్పు పడుతూ ట్వీట్ చేశారు. ఇటువంటి కీలక సమయంలో కేంద్ర ఎన్నికల కమీషన్ సభ్యుడు రాజీనామా చేసేలా చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు.