తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఎల్బీ నగర్ పరిధిలో నిర్మించిన బైరామల్‌గూడా లెవెల్-2 ఫ్లైఓవర్కి శనివారం ప్రారంభోత్సవం చేశారు. గత ప్రభుత్వం దీనిని రూ.148.05 కోట్లు వ్యయంతో నిర్మించింది కానీ ఎన్నికలలోగా పనులు పూర్తికాకపోవడంతో దీనికి ప్రారంభోత్సవం చేసే అవకాశం సిఎం రేవంత్ రెడ్డికి లభించింది.
శంషాబాద్ విమానాశ్రయం, ఒవైసీ ఆస్పత్రి వైపు నుంచి విజయవాడ, నాగార్జున సాగర్ వైపు వెళ్ళే వాహనాలు ఇకపై ఈ చౌరస్తాలో ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఈ ఫ్లైఓవర్‌పై నుంచి రయ్యిమని దూసుకుపోవచ్చు. చౌరస్తాలో ఈ ఫ్లైఓవర్ ఇంగ్లీష్ అక్షరం ‘వై’ ఆకారంలో మూడు వైపులా చీలుతుంది. దానిలో కుడివైపు రోడ్డుపై ప్రయాణిస్తే బీఎస్ఎన్ రెడ్డి నగర్, ఎడమ వైపు రోడ్డుపై ప్రయాణిస్తే చింతలకుంట చెక్ పోస్ట్ రోడ్డు వద్దకు చేరుకోవచ్చు. ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో నిర్మించిన ఫ్లైఓవర్లాన్నిటిలోకి ఇది చాలా భిన్నంగా వివిద ప్రాంతాలను కలుపుతూ నిర్మించి నేటి నుంచే అందుబాటులోకి తీసుకురావడంతో నగరవాసులకు చాలా ట్రాఫిక్ కష్టాలు తీరాయి.