మార్చి 12న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

ఈ నెల 12వ తేదీన సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు సిఎస్ శాంతి కుమారి సంబంధిత మంత్రులు, వారి శాఖాధిపతులకు తెలియజేస్తూ శనివారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. 

మరో వారం రోజులలోగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది కనుక ఆలోగా కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలలో భాగంగా మరికొన్ని పధకాలకు ఈ సమావేశంలో ఆమోదముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. వాటిలో ఇందిరమ్మ ఇళ్ల పధకంలో భాగంగా ప్రతీ నియోజకవర్గానికి 3,5000 ఇళ్ళు చొప్పున 119 నియోజకవర్గాలకు 4,16,500 ఇళ్ళు మంజూరుకి ఈ సమావేశంలో ఆమోదముద్ర వేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ పధకానికి సంబందించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం గ్రామ సభలలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ పధకం ద్వారా ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు నాలుగు వాయిదాలలో అందించనుంది. 

ఇదికాక మహాలక్ష్మి పధకంలో భాగంగా అర్హులైన మహిళలకు నెలకు రూ.2,500 పింఛన్, చేయూత పధకం కింద వృద్ధులకు రూ.4,000 పింఛన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో హామీ ఇచ్చింది. ఈ సమావేశంలో వాటి అమలుపై సాధ్యాసాధ్యాలను చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

రైతు భరోసా పధకం కింద సన్నకారు, చిన్నకారు రైతులకు ఏడాదికి రూ.15,000, వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఇస్తామని హామీ ఇచ్చినందున ఈ పధకం అమలుపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

ఈ పధకాలలో వీలైనవాటిని ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా ప్రారంభించగలిగితే, ఎన్నికల ప్రచారంలో వాటి గురించి చెప్పుకొని ప్రజలను ఓట్లు అదిగేందుకు కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం లభిస్తుంది. కనుక ఈ సమావేశంలో కనీసం రెండు మూడు పధకాలకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.