కరీంనగర్ నియోజకవర్గం లోక్సభ ఎన్నికల సన్నాహక సభలో బిఆర్ఎస్ పార్టీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి సంచలన వ్యాఖ్యలు చేశారు. “రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం కూల్చేస్తామని చాలా ఆవేశపడుతున్నారు. కానీ మీకు ఆ భయం అక్కరలేదు. ఐదేళ్ళ మీ పాలన చూస్తేనే ప్రజలకు కేసీఆర్ పాలన ఎంత గొప్పగా ఉండేదో, రేవంత్ రెడ్డి పాలన ఏవిదంగా ఉందో అర్దమవుతుంది. అప్పుడే ప్రజలకు గాడిదకు, గుర్రానికి తేడా అర్దమవుతుంది. వెలుగు, చీకటి రెండూ చూస్తేనే వెలుగు విలువ అర్దమవుతుంది కదా?
అందుకే నిశ్చింతగా ఐదేళ్ళు పాలించుకోండి. మా పార్టీ తరపున మీ ప్రభుత్వానికి ఎటువంటి ప్రమాదమూ ఉండదని నేను హామీ ఇస్తున్నాను. మీ ప్రభుత్వాన్ని మేము కూల్చక్కరలేదు. మీ చుట్టూ ఉన్న కొందరు నేతలే మీ ప్రభుత్వాన్ని కూల్చేయడం ఖాయం.
మీ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే ఒక్కొక్కరం ఒక్కో మానవ బాంబు అవుతామని అన్నారు. మీ చుట్టూనే అనేక బాంబులు ఉన్నాయి. ఓ ఖమ్మం బాంబు, మరో నల్గొండ బాంబు ఏదో రోజు పేలితే మీ ప్రభుత్వం కూలిపోతుంది.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హుందాగా మాట్లాడాలనే ఇంగిత జ్ఞానం లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ అభివృద్ధిని ఎద్దేవా చేస్తుంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి మెచ్చుకొంటున్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీ కాళ్ళ వద్ద పెట్టి పరువు తీశారు.
కేసీఆర్ ఓ గొప్ప విజన్ ఉన్న నాయకుడు. అందుకే చాలా దూరదృష్టితో ఆలోచించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రాష్ట్రాన్ని సశ్యశ్యామలం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో నీళ్ళకు అప్పుడే కరువు ఏర్పడింది. ఇది ప్రకృతి వలన కలిగిన కరువు కాదు కాంగ్రెస్ సృష్టించిన కరువే. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వంటి పిచ్చోళ్ళకు ఇవన్నీ అర్దం కావు. అందుకే నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతుంటారు,” అంటూ కేటీఆర్ ఘాటుగా విమర్శలు గుప్పించారు.