కోదండరామ్‌, అమీర్ ఖాన్‌: ఎమ్మెల్సీ పదవులు చేజారిపాయె!

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలు నియమితులైన ప్రొఫెసర్ కోదండరామ్‌, అమీర్ అలీ ఖాన్‌లకు హైకోర్టులో చుక్కెదురైంది. వారి నియామకాలను తప్పు పడుతూ, వాటి కోసం ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేస్తున్నట్లు తీర్పు చెప్పింది. వీరి నియామకాలను గవర్నర్‌ పునః పరిశీలించాలని హైకోర్టు సూచించింది. 

గతంలో బిఆర్ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను ఎమ్మెల్సీలు నియమించలాని గవర్నర్‌కు సిఫార్సు చేసింది. కానీ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్‌ మద్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉండటంతో, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆ సిఫార్సులను తిరస్కరించింది. రాజకీయాలలో ఉన్న వారిద్దరినీ గవర్నర్‌ కోటలో ఎమ్మెల్సీలుగా నియమించలేనని చెపుతూ ఆ సిఫార్సు లేఖను వెనక్కి తిప్పి పంపారు. 

కానీ సిఎం రేవంత్‌ రెడ్డి, ఆయన మంత్రులు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పట్ల చాలా మర్యాదగా మెసులుకొంటూ, ప్రోటోకాల్ పాటిస్తుండటంతో ప్రొఫెసర్ కోదండరామ్‌, అమీర్ అలీ ఖాన్‌లకు ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు వెంటనే ఆమోదం తెలిపారు.

ఈ నియామకాలపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో పిటిషన్‌ వేయగా, వాటిపై విచారణ జరిపిన న్యాయస్థానం నేడు ఈ తీర్పుఇచ్చింది. అయితే మంత్రి మండలి నిర్ణయాలకు గవర్నర్‌ కట్టుబడి ఉండాల్సిందే అని హైకోర్టు సూచించింది

కనుక కాంగ్రెస్‌ ప్రభుత్వం మళ్ళీ వారి పేర్లను సిఫార్సు చేస్తే గవర్నర్‌ ఆమోదించడం ఖాయమే. ఈసారి బిఆర్ఎస్‌ నేతలు అభ్యంతరం చెప్పినా హైకోర్టు పట్టించుకోకపోవచ్చు. కనుక ప్రొఫెసర్ కోదండరామ్‌, అమీర్ అలీ ఖాన్‌లకు కాస్త నిరాశ కలిగినప్పటికీ త్వరలోనే వారు మళ్ళీ ఎమ్మెల్సీలుగా నామినేట్ అవడం ఖాయమే.