మల్లారెడ్డి అల్లుడి కాలేజీ భవనాలు కూల్చేశారు

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజ్‌గిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీ భవనాలను నేడు రెవెన్యూ అధికారులు పాక్షికంగా కూల్చివేశారు. హైదరాబాద్‌ శివారులోని దిండిగల్లోని చిన్న దామర చెరువు వద్ద ‘ఎఫ్‌టియల్ బఫర్ జోన్’ ఉంది. 

మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు దానిలో 8.24 ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువు భూమిని మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జా చేసి దానిలో ఏరో నాటికల్, ఎంఎల్ఆర్ టిఎం కళాశాలల కోసం కొన్ని భవనాలు, షెడ్లు, రోడ్లు నిర్మించుకున్నారు. 

అప్పుడు పిసిసి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్‌ రెడ్డి ఈ ఆక్రమణల గురించి నిలదీసినా, అప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో మల్లారెడ్డి మంత్రిగా ఉండటంతో రెవెన్యూ అధికారులు ఈ ఆక్రమణలని అడ్డుకోలేకపోయారు. కనీసం ఆయనకు నోటీస్ పంపే సాహసం చేయలేకపోయారు. 

ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెవెన్యూ అధికారులు మర్రి రాజశేఖర్ రెడ్డికి నోటీసులు పంపించి సంజాయిషీ కోరారు. కానీ సమాధానం రాకపోవడంతో జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు నేడు నీటిపారుదల శాఖ అధికారులు, మునిసిపల్ సిబ్బంది, పోలీసులతో కలిసి వెళ్ళి వాటిలో కొన్ని భవనాలను పాక్షికంగా కూల్చివేసి, మిగిలినవాటిని స్వచ్ఛందంగా తొలగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అక్కడకు విద్యార్దులు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కానీ ఆధీకారులు వారికి వివరించి చెప్పి శాంతింపజేశారు.