బిఆర్ఎస్‌, బీఎస్పీ పొత్తుతో కోనేరు కోనప్ప అవుట్!

బిఆర్ఎస్‌, బీఎస్పీలు లోక్‌సభ ఎన్నికలలో పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బిఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. సిర్పూర్ నుంచి తన అనుచరులను ఈరోజు హైదరాబాద్‌లో సమావేశమయిన తర్వాత భవిష్య కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.

అయితే ఆయన ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు ఉదయం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు. 

కోనేరు కోనప్ప బీఎస్పీతో పొత్తుని వ్యతిరేకించడానికి బలమైన కారణమే ఉంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో సిర్పూర్ నుంచి ఆయన పోటీ చేయగా, బీఎస్పీ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్‌ కూడా అక్కడి నుంచే పోటీ చేయడంతో ఓట్లు చీలిపోయాయి. దాంతో కోనేరు కోనప్ప ఓడిపోయారు.

సిర్పూర్‌లో కాంగ్రెస్‌, బీజేపీ, బిఆర్ఎస్, బీఎస్పీల మద్య జరిగిన పోటీలో బీజేపీ అభ్యర్ధి డా.పల్లవి హరీష్ బాబు చేతిలో కోనేరు కొనప్ప కేవలం 3088 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తన ఓటమికి కారణమైన ప్రవీణ్ కుమార్‌తో కేసీఆర్‌ పొత్తులు పెట్టుకొనేందుకు సిద్దపడటంతో సహజంగానే కోనేరు కొనప్పకి తీవ్ర ఆగ్రహం, అసహనం కలిగి, పార్టీ వీడబోతున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.