తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్రమోడీ దేశానికి పెద్దన్న వంటివారు. దేశ ప్రధానిని గౌరవిస్తూ పెద్దన్న అంటే అదేదో బూతు పదం అన్నట్లు బిఆర్ఎస్ నేతలు మాట్లాడుతుండటం సిగ్గుచేటు.
మోడీని పెద్దన్న అంటే తప్పు పడుతున్న బిఆర్ఎస్ నేతలు శాసనసభ సమావేశాలకు రాకుండా మొహం చాటేసిన తమ అధినేత కేసీఆర్‌ని మాత్రం ప్రతిపక్ష నాయకుడుగా గౌరవించాలని కోరుకొంటున్నారు. శాసనసభకు రానప్పుడు ఆయన ప్రతిపక్ష నేత ఎలా అవుతారు?
లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్, బీఎస్పీలు పొత్తులు పెట్టుకున్నా ఒరిగేదేమి ఉండదు. లోక్‌సభ ఎన్నికలను మా ప్రభుత్వ పాలనపై ప్రజల తీర్పుని కోరుతున్నాము. కనుక ఈ ఎన్నికలు మా పాలనకు రిఫరెండంగా భావిస్తున్నాము. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కనీసం 14 సీట్లు గెలుచుకునే లక్ష్యంతో పనిచేస్తున్నాము.
నా కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నారనే వార్తలలో నిజం లేదు. ఎవరూ పోటీ చేయడం లేదు. నా ప్రభుత్వం పడిపోతుందని బిఆర్ఎస్ నేతలు ఆశగా ఎదురుచూస్తున్న సంగతి నాకు తెలుసు. ఎందుకు పడిపోతుందో వారే చెప్పాలి.
ముఖ్యమంత్రిని ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు కలవకూడదనే దుస్సాంప్రదాయాన్ని కేసీఆర్ ప్రారంభిచారు. అందుకే తన పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసం వచ్చి నన్ను కలిస్తే ఏదో జరిగిపోతోందని గగ్గోలు పెడుతున్నారు,” అని అన్నారు.