పాతబస్తీ మెట్రోకు సిఎం రేవంత్‌ శుక్రవారం శంకుస్థాపన

హైదరాబాద్‌ పాతబస్తీ మీదుగా సాగే 5.5 కిమీ మెట్రో కారిడార్‌కు శుక్రవారం సిఎం రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. సికింద్రాబాద్‌, జేబిఎస్ నుంచి పాతబస్తీ మీదుగా ఫలక్‌నుమా వరకు మెట్రో కారిడార్ ఏర్పాటుకు చాలా ఏళ్ళ క్రితమే రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైనప్పటికీ అందరికీ తెలిసిన అనేక సమస్యల కారణంగా ఇంతవరకు పనులు మొదలుపెట్టలేకపోయింది. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ ప్రాజెక్టుని వీలైనంత త్వరగా పూర్తి  చేయాలని నిర్ణయించారు. 

జేబిఎస్ నుంచి పాదారుషిఫా, పురానీ హవేలీ, ఏత్ బార్ చౌక్, అలిజా కోట్ల, మీర్ మొయిన్ దాయరా, హరిబౌలి, శాలిబండ, షంషీర్ గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్‌నుమా వరకు సాగే ఈ మెట్రో కారిడార్ నిర్మించేందుకు సుమారు రూ.2,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 

ఈ మార్గంలో సాలార్ జంగ్ మ్యూజియం, ఛార్మినార్, శాలిబండ, ఫలక్‌నుమాల వద్ద మెట్రో స్టేషన్లు నిర్మించనున్నారు. దీంతోపాటు ఫలక్‌నుమా నుంచి చంద్రాయణ గుట్ట వరకు మరో 1.5 కిమీ మెట్రో కారిడార్ ఏర్పాటుకాబోతోంది. 

మూడో దశలో నాగోలు, ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్ పల్లి-పి7 మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించబోతున్న మెట్రో కారిడార్‌లో చంద్రాయణ గుట్ట ఇంటర్ ఛేంజ్ స్టేషన్‌గా ఉండబోతోంది.