బీజేపీ ఎంపీ సోయం బాపూరావు సంచలన వ్యాఖ్యలు

బీజేపీ నిన్న ప్రకటించిన తొలి జాబితాలో అదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు పేరు లేకపోవడంతో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “దళితుడినైన నాకు మళ్ళీ టికెట్‌ లభిస్తే ఈసారి తప్పకుండా కేంద్రమంత్రి పదవి లభిస్తుందనే అసూయతోనే రాష్ట్ర బీజేపీ నాయకులలో కొందరు నాకు టికెట్‌ రాకుండా అడ్డుపడుతున్నారు. కానీ మా పార్టీ అధిష్టానానికి నా బలం, బలగం గురించి బాగా తెలుసు కనుక తప్పకుండా టికెట్‌ ఇస్తుందని భావిస్తున్నాను. ఒకవేళ నా అవసరం లేదనుకుంటే అది వారిష్టం.

కానీ ఇతర పార్టీల నుంచి కూడా నేతలను తెచ్చుకొని టికెట్లు ఇస్తున్నప్పుడు పార్టీనే నమ్ముకొని పని చేస్తున్న నాకు టికెట్‌ ఇవ్వడానికి మా అధిష్టానం వెనకాడుతోంది. ఒకవేళ రెండో జాబితాలో నా పేరు కనబడకపోతే నా దారి నేను చూసుకుంటాను. స్వతంత్ర అభ్యర్ధిగానైనా పోటీ చేసి మళ్ళీ నా సీటు నేను గెలుచుకుంటాను,” అని పార్టీకి వార్నింగ్ ఇచ్చారు.