మల్లారెడ్డికి కాంగ్రెస్‌ ప్రభుత్వం షాక్!

మాజీ మంత్రి, మేడ్చల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి కాంగ్రెస్‌ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన ఆయన గుండ్లపోచంపల్లి మునిసిపాలిటీ పరిధిలో 2,500 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని తన కాలేజీకి రోడ్డు వేసుకున్నారు.

ఆ సమయంలో కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్న రేవంత్‌ రెడ్డి దానిపై అప్పుడే అభ్యంతరం చెప్పారు. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అవడంతో జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు మునిసిపల్ అధికారులు జేసీబీతో ఆ రోడ్డుని తవ్వి తొలగించేశారు.

తన కాలేజీకి వేసుకున్న రోడ్డుని మునిసిపల్ సిబ్బంది తొలగించడంపై మల్లారెడ్డి తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నేను హెచ్ఎండీఏ అనుమతితోనే రోడ్డు నిర్మించుకున్నాను. ఇందుకు బదులుగా వేరే చోట 2,500 చదరపు గజాల స్థలం హెచ్ఎండీఏకి అప్పుడే అప్పగించాను.

కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కొందరు పెద్దలు నన్ను టార్గెట్ చేసుకొని ఈవిదంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ రోడ్డు తవ్వేయడం వలన కాలేజీకి వచ్చే విద్యార్దులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడతారు. కనుక ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.