సికింద్రాబాద్ కంటోన్మెంట్ మీదుగా ఫ్లైఓవర్ నిర్మించేందుకు రక్షణశాఖ అనుమతి మంజూరు చేసిందని ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం తెలియజేసింది. గత ప్రభుత్వ హయాంలో దీనికోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టగానే ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, రక్షణమంత్రి రాజ్నాధ్ సింగ్లని కలిసి దీని గురించి మాట్లాడి ఒప్పించారు.
హైదరాబాద్ నుంచి కరీంనగర్, రామగుండం, మహారాష్ట్రలోని నాగ్పూర్ వైపు నిత్యం వేలాది వాహనాలు కంటోన్మెంట్లోని ఇరుకు రోడ్ల గుండానే రాకపోకలు సాగిస్తుంటాయి. కానీ ఆ ప్రాంతం అంతా రక్షణ శాఖ అధీనంలో ఉండటం, దానిలో ఫ్లైఓవర్ నిర్మాణానికి 83 ఎకరాలు అవసరం పడటంతో, రాష్ట్ర ప్రభుత్వం ఫ్లైఓవర్ నిర్మించలేకపోతోంది.
సికింద్రాబాద్ ప్యారడైజ్ చౌరస్తా నుంచి 44వ జాతీయ రహదారిని కలుపుతూ కండ్లకోయ వరకు 18.30 కిమీ పొడవునా భారీ వాహనాలు సైతం సులువుగా ప్రయాణించేందుకు వీలుగా 6 లేన్లతో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో 12.68 కిమీ ఎలివేటడ్ ఎక్స్ప్రెస్ కారిడార్ ఉంటుంది.
మున్ముందు దీని పక్కనే లేదా పైన మెట్రో రైల్ కారిడార్ కూడా నిర్మించేందుకు వీలుగా భూసేకరణ చేసి, తదనుగుణంగా ఎలివేటడ్ ఎక్స్ప్రెస్ కారిడార్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.
దీని కోసం గత ప్రభుత్వం చాలా ప్రయత్నాలే చేసినప్పటికీ, కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడుతుండటం వలన ఆమోదం లభించలేదు. కానీ సిఎం రేవంత్ రెడ్డి భేషజాలు పక్కన పెట్టి ప్రధాని నరేంద్రమోడీని మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేయడంతో 8 ఏళ్ళుగా పెండింగులో ఉన్న సమస్య రెండు నెలల్లోనే పరిష్కారం అయ్యింది.
కేంద్ర ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున త్వరలోనే దీనికి సంబంధించి కార్యాచరణ మొదలుపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.