యాదాద్రి పేరుని యాదగిరి గుట్టగా మారుస్తాం!

ఒకప్పుడు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి పుణ్యక్షేత్రాన్ని యాదగిరిగుట్ట అని పేరుండేది. కేసీఆర్‌ దానిని యాదాద్రిగా మార్చి వందల కోట్లు ఖర్చు చేసి గుట్టపై స్వామివారి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పుణ్యక్షేత్రానికి ధీటుగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్‌ యాదగిరిగుట్ట పేరుని యాదాద్రిగా మార్చి అభివృద్ధి చేశారు.

ఆలేరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్ బీర్ల ఐలయ్య శుక్రవారం యాదాద్రి స్వామివారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “మనుషులు, వీధులు, ఊర్లు, రాష్ట్రాల పేర్లు మార్చుకోవచ్చు కానీ పుణ్యక్షేత్రాల పేర్లు మార్చరాదు. అది మహా అపచారమే. కనుక యాదాద్రి పేరుని మళ్ళీ యాదగిరి గుట్టగా మార్చుతాము. త్వరలోనే ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. 

ఆలయంలో పూజలు, కైంకర్యాలు అన్నీ వైదిక సాంప్రదాయాల ప్రకారం జరిగేలా చర్యలు తీసుకొంటున్నాము. అలాగే గుట్టపై భక్తుల సౌకర్యం కోసం డార్మీటరీ హాల్, ఆలయ పూజారుల కోసం విశ్రాంతి గదులు వగైరా నిర్మించేందుకు అధికారులకు ఆదేశించాము.

 ఆలయ అభివృద్ధి, సాంప్రదాయం ప్రకారం నిత్య పూజలు, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రతీ నెల సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను,” అని చెప్పారు.