మేడిగడ్డ బ్యారేజిపై కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మద్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ నేతలు బ్యారేజి సందర్శించి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీటుగా స్పందించారు.
సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్ కమీషన్ల కక్కుర్తికి మేడిగడ్డ ప్రత్యక్ష నిదర్శనం. తుమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసీ చెప్పిందని కేసీఆర్ అబద్దాలు చెప్పారు. ఎంత పెద్ద ప్రాజెక్ట్ కడితే అంత ఎక్కువ కమీషన్లు దండుకోవచ్చనే ఉద్దేశ్యంతోనే మేడిగడ్డ వద్ద బ్యారేజి నిర్మాణానికి పూనుకున్నారు.
కేసీఆర్ ప్రభుత్వానికి ఎంతసేపు కమీషన్ల కక్కుర్తే తప్ప అంత పెద్ద ప్రాజెక్టు అక్కడ కడితే అది ధృడంగా నిలబడుతుందా లేదా అని తెలుసుకునేందుకు ముందుగా జియలాజికల్ సర్వే కూడా చేయించలేదు. చేయించి ఉంటే నేడు ఈవిధంగా క్రుంగిపోయేది కాదు. ప్రభుత్వం వద్ద ఆ రిపోర్టు లేదు కనుకనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆధారిటీ అడిగినా ఇవ్వలేకపోయాము.
మేడిగడ్డ నిర్మాణం పూర్తయిన తర్వాత ఏటా బ్యారేజీని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు దాని పరిస్థితిని వివరిస్తూ నివేదికలు తయారు చేయాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం అది కూడా చేయలేదు. అందువల్లే ఆ నివేదికలు కూడా మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆధారిటీ ఇవ్వలేకపోయాము.
కేసీఆర్ ప్రభుత్వం మేడిగడ్డ పిల్లర్లు దెబ్బ తిన్నాయని తెలిసినా ఆ విషయం ఎవరికీ తెలియకుండా దాచిపెట్టి నీళ్ళు వదులుతుండటం వలననే ఇంకా ఎక్కువ నష్టం జరిగింది.
మేడిగడ్డ బ్యారేజి నిర్మాణం పూర్తయిన్నట్లు నిర్మాణ సంస్థ ధృవీకరణ పత్రాలు ఇచ్చింది. కానీ ప్రతీ బ్లాకుని అధికారులు పరిశీలించి పనులు పూర్తయ్యాయని ధృవీకరిస్తూ నివేదిక తయారు చేయలేదు. అందుకే ఈ నివేదిక కూడా ఇవ్వలేకపోయాము.
మేడిగడ్డ బ్యారేజిలో అడుగడుగునా అలసత్వం, తొందరపాటు, లోపాలు ఉన్నట్లు విజిలెన్స్ అధికారుల దర్యాప్తులో బయటపడుతోంది. ఆ నివేదిక రాగానే ఈ ప్రాజెక్టులో దీనికి బాధ్యులైన అధికారులందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఈ విషయాలన్నీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆధారిటీకి లిఖిత పూర్వకంగా తెలియజేశాము,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.