బిఆర్ఎస్ పార్టీ నేతలు తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్వర్యంలో మేడిగడ్డ, అన్నారం బ్యారేజిల సందర్శనకు వెళ్ళారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ బ్యారేజి ఒక్కటే కాదు దానిలో ఇంకా వంద అంకాలు ఉన్నాయి.
మేడిగడ్డ బ్యారేజిలో 1.6 కిమీ పొడవునా చిన్న సమస్య ఏర్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం దానిని సరిచేయించకుండా, దానిని పదేపదే భూతద్దంలో నుంచి చూపిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం దెబ్బ తిందన్నట్లు మాట్లాడుతూ, మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. ఈ లోపాలకు బాద్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని మేము చెపుతూనే ఉన్నాము.
మాపై రాజకీయ కక్ష తీర్చుకోవాలనుకుంటే తప్పకుండా తీర్చుకోండి కానీ రైతులకు నీళ్ళిచ్చి కాపాడండి. మేడిగడ్డ, అన్నారం బ్యారేజిలకి వర్షాకాలం మొదలయ్యేలోగా మరమత్తులు చేయించండి. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో ఆడుకోవద్దని మనవి చేస్తున్నాము,” అని అన్నారు.
మాజీ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు అన్నారం బ్యారేజి వద్ద మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షలాది ఎకరాలకు నీళ్ళు పారించారు. వేసవి కాలంలో కూడా నీటి కొరత లేకుండా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆయనకు మంచి పేరు వచ్చిందనే అసూయతోనే కాంగ్రెస్ ప్రభుత్వం దానిని కూలిపోయేలా చేసి కేసీఆర్ ఆనవాలు లేకుండా చేయాలని కుట్ర చేస్తోంది.
కేసీఆర్‌ని తెలంగాణలో నుంచి తుడిచి పెట్టేయాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు. కానీ తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడి, రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి చూపిన కేసీఆర్ ప్రజల హృదయాలలో ఉన్నారు. ఆయనను చెరిపేయడం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు.
తెలంగాణ ఉద్యమాలకు దూరంగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ గురించి మొసలి కన్నీళ్ళు కార్చుతున్నారు. ఉద్యమాలలో పాల్గొనకపోతే పాయే. కానీ పరిపాలన సక్రమంగా చేయాలని, అన్ని విధాలా అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము,” అని అన్నారు.