జగన్మోహన్‌ రెడ్డికి ఓట్లు వేయొద్దు: సునీతా రెడ్డి

వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి శుక్రవారం ఢిల్లీలో ప్రెస్‌మీట్‌ పెట్టి తన సోదరుడు ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

“నా తండ్రి వివేకా హత్య కేసులో వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి ప్రమేయం ఉంది. వారిద్దరినీ అరెస్ట్ కాకుండా మా అన్న జగన్మోహన్‌ రెడ్డి కాపాడుతున్నారు. హంతకులు ఎక్కడో ఉండరు. మన మద్యనే తిరుగుతూ ఉంటారని తర్వాత అర్దం చేసుకున్నాను. 

నేను న్యాయం కోసం సీబీఐ, సుప్రీంకోర్టు చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా, ఆ కేసుని ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేయించుకున్నా, ఈ 5 ఏళ్ళలో సీబీఐ విచారణ ఒక్క అడుగు ముందుకు కదలలేకపోయింది.

ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి కర్నూలులో ఉన్నప్పుడు, హైదరాబాద్‌ నుంచి సీబీఐ అధికారులు ఆయనని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. కానీ అరెస్ట్ చేయలేక తిరిగివచ్చారు. దీనిని బట్టి ఈ కేసు విచారణ ముందుకు జరుగకుండా ఎవరు అడ్డుకుంటున్నారో అర్దమవుతోంది. 

ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా అవినాష్ రెడ్డి నేరస్థుడిగా జైలుకి వెళ్ళక తప్పదు. అతనిని కాపాడుకొని వస్తున్నవారు కూడా కోర్టుకి సమాధానం చెప్పుకోకతప్పదు. హత్యారాజకీయాలు చేస్తున్న మా అన్నకి, వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి రాబోయే ఎన్నికలలో ఆంధ్ర ప్రజలు ఎవరూ ఓట్లు వేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ వేస్తే ఆంధ్రప్రదేశ్‌ సర్వ నాశనం అవుతుంది,” అని సునీతా రెడ్డి అన్నారు.