త్వరలో లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ శాసనసభ ఎన్నికలు కూడా జరుగబోతున్నాయి. ఈ ఎన్నికలలో అధికార వైసీపి ఒంటరిగా పోటీ చేయబోతుండగా, టిడిపి, జనసేనలు, బహుశః వాటితో బీజేపీ కూడా కలిసి పోటీ చేయబోతున్నాయి.
ఇప్పటికే ఏపీలోని 175 సీట్లకు వైసీపి 69 మందిని, 25 ఎంపీ సీట్లకు 18 మంది నియోజకవర్గం ఇన్చార్జిలను(అభ్యర్ధులు) ప్రకటించింది.
ఇవాళ్ళ టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి తమ పార్టీల అభ్యర్ధుల తొలి జాబితాని ప్రకటించారు.
175 శాసనసభ స్థానాలలో టిడిపి 94 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించగా, జనసేనకు మొత్తం 24 స్థానాలకు ఐదుగురు అభ్యర్ధులను ప్రకటించింది. టిడిపితో పొత్తులో భాగంగా జనసేనకు 24 శాసనసభ, 3 లోక్సభ స్థానాలు దక్కాయి. ఒకవేళ బీజేపీ వాటితో కలిస్తే మిగిలిన 57 స్థానాలలో మూడు పార్టీలు పంచుకోవలసి ఉంటుంది లేకుంటే వాటికి టిడిపి, జనసేనలు అభ్యర్ధులు సిద్దంగా ఉన్నారు.
చంద్రబాబు నాయుడు మళ్ళీ మరోసారి కుప్పం నియోజకవర్గం నుంచే పోటీ చేయబోతున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారో ఇంకా ప్రకటించలేదు. బహుశః భీమవరం నుంచి పోటీ చేయవచ్చని తెలుస్తోంది.