సీనియర్ కాంగ్రెస్‌ నేత మల్లు రవి పదవికి రాజీనామా

ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన జనవరి 28వ తేదీన ఈ పదవీ బాధ్యతలు చేపట్టారు. కానీ నెలరోజులు తిరక్క ముందే పదవికి రాజీనామా చేయడం విశేషం.

మాజీ ఎంపీ అయిన మల్లు రవి త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. శుక్రవారం జిల్లాలోని కల్వకుర్తిలో తన అనుచరులతో జరిగిన సమావేశంలో ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. నేడు తన రాజీనామా లేఖను పిసిసి అధ్యక్షుడు, సిఎం రేవంత్‌ రెడ్డికి పంపించబోతున్నారు. 

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో మల్లు రవి జడ్చర్ల నుంచి పోటీ చేస్తారనుకున్నప్పటికీ, ఆయన నాగర్‌కర్నూల్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలనే ఉద్దేశ్యంతో ఆ ఎన్నికలకు దూరంగా ఉండి పార్టీ ప్రచార, ప్లానింగ్ కమిటీలకు కన్వీనరుగా పనిచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎం రేవంత్‌ రెడ్డి మల్లు రవిని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు.

అయితే లోక్‌సభ ఎన్నికలలో నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీ చేసేందుకు సంపత్ కుమార్‌ మరికొంతమంది దరఖాస్తు చేసుకోవడంతో మల్లు రవి తాను ఈ రేసులో ఉన్నానని స్పష్టం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.