మహాలక్ష్మిల చేతికే గ్యాస్ రాయితీ సొమ్ము

మహాలక్ష్మి పధకంలో భాగంగా తెలంగాణలో రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ రాయితీ సొమ్ముని నేరుగా గ్యాస్ డీలర్లకే చెల్లించాలని మొదట భావించినప్పటికీ, ఆయిల్ కంపెనీలు, గ్యాస్ డీలర్లతో ఏర్పడే కొన్ని సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆ సొమ్ముని నేరుగా ఈ పధకంలో లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలోనే జమా చేయాలని నిర్ణయించింది. 

ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 955 ఉంది. దానిని రాష్ట్ర ప్రభుత్వం రూ.500లకే అందించబోతోంది కనుక మిగిలిన రూ.455లు నేరుగా ఈ పధకానికి ఎంపిక చేసిన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమా చేయబోతోంది. అయితే లబ్ధిదారులు ముందుగా రూ.955 చెల్లించి గ్యాస్ సిలిండర్ తీసుకోవలసి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం రాయితీ సొమ్ముని వారి బ్యాంక్ ఖాతాలలో జమా చేస్తుంది. 

ఈ పధకానికి పౌరసరఫరాల శాఖ కొన్ని విధివిధానాలను రూపొందించింది. ఆ వివరాలు... 

1. మొదటి దశలో రాష్ట్రంలో గుర్తించిన సుమారు 40 లక్షల మంది లబ్ధిదారులకు మాత్రమే ఈ పధకం వర్తిస్తుంది. 

2. ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ కలిగి అది వినియోగంలో ఉండాలి. ఆహార భద్రత కార్డులు ఉన్నవారికి మాత్రమే ఈ పధకం వర్తిస్తుంది.  

3. కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకున్నవారికి ఇది వర్తించదు.

4. గత మూడేళ్ళలో వాడిన సిలిండర్స్ సగటు ఆధారంగా ఏడాదికి ఎన్ని రాయితీ సిలిండర్స్ ఇవ్వాలో ముందే ఖరారు చేస్తారు. అంతకు మించి కావాలనుకుంటే పూర్తి ధర చెల్లించి తీసుకోవలసి ఉంటుంది. 

5. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేదికగా ఎస్‌బిఐ నోడల్ బ్యాంకుగా వ్యవహరిస్తుంది. ఎస్‌బిఐ  ద్వారా ఈ పధకంలో లబ్ధిదారుల ఖాతాలకు నగదు బదిలీ చేయబడుతుంది.