ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ అరెస్ట్?

ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్‌ని ఒకటి రెండు రోజులలో సీబీఐ అరెస్ట్ చేయబోతోందంటూ ఆమాద్మీ సీనియర్ నేత గోపాల్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొని ఇండియా కూటమిలో ఉండాలనుకోవడమే ఇందుకు కారణమని అన్నారు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు పేరుతో ఆయనను వేదిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు సీబీఐ ద్వారా ఆయనకు నోటీస్ ఇప్పించి అరెస్ట్ చేయబోతోందని గోపాల్ రాయ్ అన్నారు. 

తమ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసేందుకు ఈడీ చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించకపోవడంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సీబీఐని తమపైకి ఉసిగొల్పుతోందని ఆరిఓపించారు. అయితే అర్వింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసినప్పటికీ, ఆమాద్మీ, కాంగ్రెస్ పార్టీల మద్య పొత్తు ఉంటుందని, రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వాములుగా పనిచేస్తాయని గోపాల్ రాయ్ స్పష్టం చేశారు. 

ఢిల్లీ ప్రజల అభిమానాన్ని పొందుతున్న అర్వింద్ కేజ్రీవాల్‌ని సీబీఐ అరెస్ట్ చేస్తే ప్రజలు రోడ్లపైకి వచ్చి సునామీ సృషించడం ఖాయమని గోపాల్ రాయ్ అన్నారు. 

ఇదే కేసులో కేసీఆర్‌ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడా సీబీఐ నోటీస్ పంపించి ఈనెల 26న ఢిల్లీలో తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కోరింది. ఒకవేళ సీబీఐ అర్వింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసిన్నట్లయితే, కల్వకుంట్ల కవితని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉండవచ్చు.