బిఆర్ఎస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (33) ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున కారు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు పటాన్చెరు సమీపంలో ఓఆర్ఆర్ వద్ద అదుపు తప్పి డివైడర్ని ఢీ కొట్టడంతో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కారు డ్రైవర్ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది.
లాస్య నందిత మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె. ఏడాది క్రితం ఆయన మృతి చెందడంతో, కేసీఆర్ ఆమెకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి బిఆర్ఎస్ అభ్యర్ధిగా టికెట్ ఇచ్చారు. ఆమె తొలి ప్రయత్నంలో సమీప కాంగ్రెస్ అభ్యర్ధిపై 17,169 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు.
ఈ నెల 13న నల్గొండలో బిఆర్ఎస్ సభకు వెళుతున్నప్పుడు కూడా ఆమె కారుకి ప్రమాదం జరిగింది. నార్కాట్ పల్లి నుంచి వస్తున్న ఓ టిప్పర్ ఆమె కారుని ఢీకొంది. ఆ ప్రమాదంలో స్వల్ప గాయాలతో లాస్య నందిత బయటపడగలిగారు. కానీ ఈసారి కారు ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయారు.