రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందట!

మన దేశంలో ప్రజాస్వామ్య విలువలు నానాటికీ ఎంతగా దిగజారిపోతున్నాయో, తెలంగాణ రాజకీయాలను చూస్తే అర్దమవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చి నెలరోజులు కాక మునుపే ప్రభుత్వం పడిపోతుందని లేకుంటే కూల్చేసి మేమే మళ్ళీ అధికారంలోకి వస్తామని బిఆర్ఎస్ పార్టీ నేతలు నిసిగ్గుగా చెప్పుకుంటున్నారు.

గతంలో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ గగ్గోలు పెట్టేసిన బిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు అదే తప్పు చేయాలని ఎందుకు ఆరాటపడుతోంది? అంటే అధికారం లేకుండా బిఆర్ఎస్‌ ఉండలేదు. మరో పార్టీ అధికారంలో ఉంటే సహించలేదనుకోవాలేమో? 

ఇప్పుడు బీజేపీ కూడా బిఆర్ఎస్ పార్టీకి వంతపాడటం మొదలుపెట్టింది. ఆ పార్టీ నేతలు కేంద్రంలో మళ్ళీ మోడీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పుకొంటున్నారు. అది వాస్తవం కూడా. కానీ తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పుకోవడమే చాలా హాస్యాస్పదంగా ఉంది. 

బిఆర్ఎస్ పార్టీకి సొంతంగా 39 మంది ఎమ్మెల్యేలు, దానికి మిత్రపక్షమైన మజ్లీస్‌ పార్టీకి మరో ఏడుగురు ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 46 మంది ఉన్నారు. కనుక అది రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పడిపోవాలని, మళ్ళీ తాము అధికారంలోకి రావాలని ఆరాటపడుతోందని అర్దమవుతోంది. కానీ బీజేపీకి కేవలం 9 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఆ పార్టీ కూడా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని, త్వరలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పుకోవడం దురాశే కదా?

బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటున్నాయి కనుక అందుకు కుట్రలు చేయకుండా ఉంటాయా? అంటే తప్పక చేస్తాయనే అనుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఈవిదంగా కూల్చేసే దుసాంప్రదాయం మొదలైతే, ఇక ఏ ప్రభుత్వమూ ఎక్కువకాలం మనుగడ సాగించలేదు.