మేడారం జాతరకు హెలికాఫ్టర్‌ సౌకర్యం

బుధవారం నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే లక్షల మంది భక్తులు మేడారం చేరుకొని జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. 

ఈసారి కూడా హనుమకొండ నుంచి మేడారం జాతర వెళ్ళేందుకు పర్యాటక శాఖ హెలికాఫ్టర్‌ సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. బుధవారం నుంచి మేడారం జాతర ముగిసేరోజు (ఆదివారం) వరకు ప్రతీరోజు హనుమకొండ నుంచి  హెలికాఫ్టర్‌ సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.

హనుమకొండ-మేడారం-హనుమకొండ రౌండ్ ట్రిప్ కొరకు ఒక్కొక్కరికీ టికెట్‌ చార్జి రూ.28,999గా నిర్ణయించారు. దీనిలో విఐపీ దర్శనం టికెట్‌ ఛార్జీలు కూడా కలిపి ఉంటాయి. హెలికాఫ్టర్‌లో ఒకేసారి ఆరు మంది ప్రయాణించవచ్చు. కనుక కుటుంబసమేతంగా లేదా బంధుమిత్రులతో కలిసి వెళ్ళవచ్చు. 

ఇంత ఖర్చు భరించలేమనుకున్నవారి కోసం పర్యాటక శాఖ మరో ప్లాన్ కూడా అందుబాటులో ఉంచింది. రూ.4,800 ఛార్జీతో మేడారం పరిసర ప్రాంతంలో సరదాగా కాసేపు హెలికాఫ్టర్‌ విహరిస్తూ జాతర వైభవాన్ని చూసి ఆనందించవచ్చు. సుమారు 6-7 నిమిషాల సేపు హెలికాఫ్టర్‌లో సాగే ఈ రైడ్‌, వనదేవతల గద్దెల పక్క నుంచి జంపన్నవాగు మీదుగా చిలుకల గుట్ట తదితర చుట్టుపక్కల ప్రాంతాల మీదుగా సాగుతుంది.   

హెలికాఫ్టర్‌లో పయనించేందుకు ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దీనికి సంబందించి పూర్తి సమాచారం కొరకు ఫోన్ నంబర్లు: 74834 33752, 040-03 99999, ఈమెయిల్: infor@helitaxi.com కి వ్రాసి తెలుసుకోవచ్చు.