గృహజ్యోతికి ఆధార్ తప్పనిసరి

కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీ పధకాలలో ఒకటైన గృహజ్యోతి పధకంలో నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు తెలంగాణ ఇంధన శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

దీని ప్రకారం ఈ పధకం పొందాలనుకునేవారు తప్పనిసరిగా ఆధార్ పరిశీలన చేయించుకుని ధృవీకరణ చేయించుకోవలసి ఉంటుంది. బయోమెట్రిక్ విధానంలో ఆధార్ ధృవీకరణ అయితేనే ఈ పధకానికి దరఖాస్తు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. 

ఈ పధకానికి దరఖాస్తు చేసుకునేవారికి వారి పేరు మీదనే కరెంట్ బిల్లు ఉండాలి. అంటే ఇల్లు వారి పేరు మీద ఉండాలి. వారు మాత్రమే సంబందిత విద్యుత్ అధికారి లేదా ఉద్యోగులకు దరఖాస్తుతో పాటు తమ విద్యుత్ బిల్లు, ఆధార్ కార్డు కాపీలు సమర్పించాల్సి ఉంటుంది.

ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే దానికి దరఖాస్తు చేసుకుని, అది వచ్చేలోగా ప్రభుత్వం గుర్తించిన ఏ గుర్తింపు కార్డునైనా దరఖాస్తుతో సమర్పించవచ్చు. కానీ ఈ పధకం పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి. అలాగే దానిని బయోమెట్రిక్ విధానంలో ధృవీకరించుకోవలసి ఉంటుంది. 

ఈ ప్రక్రియతో లబ్ధిదారులుగా ధృవీకరించిన్నట్లు కాదు. లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలను త్వరలోనే ప్రకటిస్తామని ఇంధన శాఖ తెలిపింది.