బిఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన వద్దిరాజు

తెలంగాణలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలలో రెండింటికి రేణుకా చౌదరీ, అనిల్ కుమార్‌ యాదవ్‌లను  కాంగ్రెస్ అభ్యర్ధులుగా ప్రకటించగా, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా వద్దిరాజు రవిచంద్ర నేడు నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. 

దేశవ్యాప్తంగా మొత్తం 56 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరుగబోతున్నాయి. నేటితో నామినేషన్స్‌ గడువు ముగిసింది. ఈ ఎన్నికలలో పార్టీల ఎమ్మెల్యేల మద్దతుతో అభ్యర్ధులు ఎన్నుకోబడతారు. 

కనుక పార్టీలు తమ బలాబలాల ప్రకారమే అభ్యర్ధులను నిలబెడతాయి. కనుక వేరే ఎవరూ పోటీ చేయరు. అభ్యర్ధులుగా ఖరారు చేయడంతోనే వారికి రాజ్యసభ సీటు ఖరారు అయిపోయినట్లే.

కనుక ఈ నెల 27న జరుగబోయే ఎన్నికలు కేవలం లాంఛనప్రాయమే. ఆ రోజు విజేతల పేర్లను అధికారికంగా ప్రకటించి ధృవీకరణ పత్రాలు ఇవ్వడం ఒక్కటే మిగిలి ఉంది.