కాళేశ్వరంపై నిరర్ధక ఖర్చు రూ.25 వేల కోట్లు: కాగ్

తెలంగాణ ప్రభుత్వం నేడు శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదికని ప్రవేశపెట్టింది. దాని ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో నిరర్ధక ఖర్చు రూ.25,000 కోట్లు. తొందరపాటుతో తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన మరో రూ.765 కోట్లు నష్టం జరిగిందని కాగ్ నివేదికలో పేర్కొంది. 

ముఖ్యంగా గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని రీ-ఇంజనీరింగ్ పేరుతో డిజైన్ మార్పు చేసి చేపట్టిన నిర్మాణాల వలన ప్రాజెక్టు ఖర్చు గణనీయంగా పెరిగిందని కాగ్ నివేదికలో పేర్కొంది. ఇన్ని వేలకోట్లు అదనంగా ఖర్చు చేసినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు వలన రాష్ట్రానికి అదనపు ప్రయోజనం కలుగలేదని కాగ్ నివేదికలో పేర్కొంది.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలనే ఆలోచన చేసిన తర్వాత సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించి, దానిపై మంత్రివర్గం, శాసనసభలో చర్చించి ఉండి ఉంటే ఖర్చు అదుపులో ఉండేదని కానీ గత ప్రభుత్వం ఆవిదంగా చేయకుండా చాలా తొందరపాటుతో రూ.25,000 కోట్లు విలువైన 17 పనులను కాంట్రాక్ట్ కంపెనీలకు అప్పగించేయడాన్ని కాగ్ నివేదిక తప్పు పట్టింది. ఈ కారణంగా ప్రాజెక్టులో కొన్ని పనులు నిరర్ధకంగా మారాయని, వాటి వలన రాష్ట్ర ప్రభుత్వానికి రూ.765 కోట్లు నష్టం వాటిల్లిందని కాగ్ నివేదికలో పేర్కొంది. 

మల్లన్నసాగర్ నిర్మాణంలో కూడా గత ప్రభుత్వం చాలా తొందరపాటు ప్రదర్శించిందని, భూకంప ప్రమాదాల గురించి ఎటువంటి అధ్యయనం చేయించకుండానే నిర్మించేసిందని, దీని వలన భవిష్యత్‌లో సమస్యలు తలెత్తవచ్చని కాగ్ నివేదికలో పేర్కొంది. 

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన ఖర్చు, దాని వలన కలిగే ప్రయోజనాల నిష్పత్తి 1.51 శాతంగా ఉండవచ్చని అంచనా వేశారని కానీ అది కేవలం 0.75 శాతం మాత్రమే ఉందని కాగ్ నివేదికలో పేర్కొంది. 

ప్రస్తుతం ఈ కాగ్ నివేదికపై శాసనసభలో కాంగ్రెస్‌, బిఆర్ఎస్ సభ్యుల మద్య చాలా వాడివేడిగా వాదోపవాదాలు జరుగుతున్నాయి.