ఇందిరమ్మ రాజ్యంలో ఇక రాజీవ్ విగ్రహాలు!

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చేసింది కనుక మళ్ళీ రాష్ట్రంలో సోనియా, రాజీవ్, రాహుల్, ప్రియాంకా గాంధీల భజనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ నేతలు వారి భజనలు చేసుకోవడం సర్వసాధారణమైన విషయమే. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సచివాలయానికి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకి బుధవారం శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, “ట్యాంక్ బండ్ మీద అంబేడ్కర్, ఇందిరా గాంధీ, పీవీ నరసింహరావు, జైపాల్ రెడ్డి విగ్రహాలు ఉన్నాయి. ఆ మహనీయుల విగ్రహాలను చూసినప్పుడు మనకి చాలా స్పూర్తి కలుగుతుంటుంది. కానీ వారి పక్కన రాజీవ్ గాంధీ విగ్రహం లేని లోటు కనిపిస్తోంది.

భారత్‌కు ఐ‌టి, కంప్యూటర్లను పరిచయం చేసి, ఐ‌టి, టెలికాం రంగాలలో దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. కనుక నేడు ఆ మహనీయుడి విగ్రహం కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. తెలంగాణ ముఖ్యమంత్రిగా నాకు ఈ అవకాశం లభించడం నా  అదృష్టంగా భావిస్తాను. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సోనియాగాంధీని ఆహ్వానించి ఆమె చేతుల మీదుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరింపజేస్తాము,” అని అన్నారు. 

ఈ కార్యక్రమంలో మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్‌ నేతలు వీ. హనుమంతరావు, షబ్బీర్ అలీ, విజయారెడ్డి, సిఎస్ శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.