తెలంగాణ కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్ధులు ఖరారు

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్‌ అధిష్టానం అభ్యర్ధులను ఖరారు చేసింది. మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్‌ నాయకురాలు రేణుకా చౌదరి, మాజీ ఎంపీ అంజన్ కుమార్‌ యాదవ్ కుమారుడు, సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్ కుమార్‌ యాదవ్ పేర్లను కాంగ్రెస్‌ అధిష్టానం ఖరారు చేసింది.

సీనియర్ కాంగ్రెస్‌ నేతలు అజయ్ మాకేన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, చంద్రశేఖర్‌లకు కర్ణాటక నుంచి రాజ్యసభకు అభ్యర్ధులుగా ఖరారు చేసింది. మరో సీనియర్ నేత అశోక్ సింగ్‌ను మధ్య ప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపిస్తోంది. 

తనను రాజ్యసభ అభ్యర్ధిగా ఎంపిక చేయడంపై అనిల్ కుమార్‌ యాదవ్ స్పందిస్తూ, నాలాంటి యువకుడికి పెద్దల సభలో అడుగుపెట్టే అవకాశం కల్పించడం చాలా సంతోషం కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసేవారికి సముచిత గౌరవం, ప్రాధాన్యం లభిస్తాయని దీంతో నిరూపించబడింది.

బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ, నాకు రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి యువకులకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారో అర్దం చేసుకోవచ్చు. నాకు ఈ అవకాశం ఇస్తారని ఏను ఎన్నడూ ఊహించలేదు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు.