బిఆర్ఎస్ పార్టీకి మోతే... రేవంత్‌ రెడ్డితో భేటీ


ఓ పక్క శాసనసభ సమావేశాలు జరుగుతుండగా, మరోపక్క త్వరలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది. ఇలాంటి సమయంలో బిఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. జీహెచ్‌ఎంసీ డెప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఆమె భర్త, బిఆర్ఎస్‌ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి ఇద్దరూ మంగళవారం జూబ్లీహిల్స్‌కు వెళ్ళి సిఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. 

వారిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిశ్చయించుకున్నారు. కొన్ని రోజుల క్రితమే మాజీ డెప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో అప్రమత్తమైన బిఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నగర కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించగా దానికి మోతే దంపతులు డుమ్మా కొట్టారు. అప్పుడే వారు కూడా కారు దిగిపోయేందుకు సిద్దమైన్నట్లు ఊహాగానాలు వినిపించాయి.

ఇప్పుడు మోతే దంపతులిద్దరూ వెళ్ళి సిఎం రేవంత్‌ రెడ్డిని కలవడంతో పార్టీ మారడం ఖరారు అయ్యింది. అంతకు ముందు స్టేషన్‌ ఘన్‌పూర్‌ బిఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా కేసీఆర్‌, కేటీఆర్‌ తీరు సరిగ్గా లేదంటూ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒక్క సీటు గెలవలేకపోయింది. కనుక లోక్‌సభ ఎన్నికలలో సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌ ఎంపీ సీట్లు దక్కించుకోవాలంటే గ్రేటర్‌పై కాంగ్రెస్‌ పట్టు సాధించాల్సి ఉంటుంది. 

ఆ ప్రయత్నంలోనే జీహెచ్‌ఎంసీ పరిధిలోనే బిఆర్ఎస్‌ నేతలను కాంగ్రెస్ పార్టీలో ఆకర్షించేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తోంది. సిఎం రేవంత్‌ రెడ్డితో మోతే దంపతుల తాజా భేటీతో అవి ఫలిస్తున్నట్లు స్పష్టమవుతోంది.