నేడే తెలంగాణ బడ్జెట్‌... రూ.2.95 లక్షల కోట్లు!

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నేడు శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతోంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నందున కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన్నట్లే, దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం కూడా నేడు మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతోంది. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో మొదటి మూడు నెలలకు అంటే ఏప్రిల్‌ నుంచి జూన్ వరకే బడ్జెట్‌లో కేటాయింపులు జరిపినప్పటికీ, ఏడాది మొత్తాన్నికి సరిపడా అంచనాలతో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క తొలిసారిగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెడతారు. రాష్ట్ర శాసనసభా వ్యవహారాలు, ఐ‌టి పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అదే సమయంలో మండలిలో బడ్జెట్‌ ప్రవేశపెడతారు. ఈసారి తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూ.2.95 లక్షల కోట్లు ఉండవచ్చని తెలుస్తోంది.

బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత దానిపై సభలో స్వల్ప చర్చ జరుగుతుంది. రేపు శాసనసభకు సెలవు కనుక మళ్ళీ 12,13 తేదీలలో బడ్జెట్‌పై పూర్తిస్థాయిలో చర్చిస్తారు.