పీవీకి భారతరత్న... అవార్డు విలువ మరింత పెరిగింది

దివంగత ప్రధాని మన తెలుగు, తెలంగాణ బిడ్డడు పీవీ నరసింహరావుకి ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డు ప్రకటించడంపై ఆయన కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి సంతోషం వ్యక్తం చేశారు. శాసనసభ ఆవరణలో ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “పార్టీలకు అతీతంగా పీవీ నరసింహారావుగారికి భారతరత్న అవార్డు ఇవ్వడం నాకు చాలా సంతోషం కలిగింది.

ఇందుకు ప్రధాని నరేంద్రమోడీగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన సంస్కారానికి ఇదో గొప్ప నిదర్శనం. పీవీకి భారతరత్న అవార్డుతో దాని విలువ, గౌరవం మరింత పెరిగాయి.

భారత్‌ తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు పీవీ చాలా నిబ్బరంగా సంస్కరణలను అమలుచేసి దేశాన్ని కాపాడారు. ఆనాడు ఆయన ఆర్ధిక సంస్కరణలు అమలుచేసి భావి తరాలకు కూడా దారి చూపారు.

దేశం కోసం, ప్రజల కోసమే తపించిన అటువంటి గొప్ప వ్యక్తికి భారతరత్న అవార్డు ఇవ్వడం చాలా సమంజసం. ఇందుకు నేను ప్రధాని నరేంద్రమోడీగారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను,” అని అన్నారు.