సీతక్క ప్రశ్నలకు బిఆర్ఎస్‌ వద్ద సమాధానాలు ఉన్నాయా?

నేడు శాసనసభ సమావేశాలకు బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఆటోరిక్షాలలో వచ్చి సభలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. వారికి మంత్రి సీతక్క చాలా ఘాటుగా బదులిచ్చారు.

“ఆనాడు టిఎస్‌ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసి చచ్చిపోతున్నా మీ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. టిఎస్‌ఆర్టీసీ భూములను కబ్జాలు చేసి, దాని ఆస్తులను దోచుకుని, ఆ సంస్థను అప్పులపాలు చేసి నష్టాల బాట పట్టించిందే మీరు. 

ఇప్పుడు మీరు టిఎస్‌ఆర్టీసీ గురించి మాట్లాడుతారా?ఆర్టీసీ బస్సులలో సామాన్యులు, పేదవారే తిరుగుతారు. అలాంటి ఆర్టీసీ బస్సుల ఛార్జీలు పెంచింది మీరు కదా? కానీ మా ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సులలో ప్రయాణించేందుకు మహాలక్ష్మి పధకం ప్రవేశపెడితే దానిని మీరు తప్పు పడుతున్నారు? మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా తిరగనీయొద్దని మీరు కోరుకుంటున్నారా చెప్పండి? మహాలక్ష్మి పధకం తీసేయమంటారా చెప్పండి? అని సీతక్క నిలదీశారు. 

రైతు బంధు దుర్వినియోగం చేయడం గురించి మాట్లాడుతూ, “మీరు రైతు బంధు పేరుతో నిరుపేద రైతులకు సాయపడకుండా బీడు భూములకు, కోటీశ్వరులకు రైతుబంధు కట్టబెట్టిన మాట వాస్తవమా కాదా చెప్పండి? కోటీశ్వరులకు రైతు బంధు ఇచ్చేందుకు ప్రజల నుంచి బలవంతంగా పన్నులు వసూలు చేసిన మాట వాస్తవమా కాదా? 

మీరు సామాన్య ప్రజలను పీడించి కోటీశ్వరులను పోషిస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న మా కాంగ్రెస్ పార్టీ ఏనాడూ పేదలను, రైతులను ప్రగతి భవన్‌, శాసనసభ ముట్టడికి తీసుకురాలేదు. కానీ మీ బిఆర్ఎస్‌ పార్టీకి ఏదోవిదంగా సెంటిమెంట్ రాజేసి ప్రజలను రెచ్చగొట్టడం అలవాటు.

అందుకే నేడు ఆటో రిక్షా డ్రైవర్లను రెచ్చగొట్టి అసెంబ్లీ ముందు ధర్నా చేయించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మీకు (హరీష్ రావు)కి అగ్గిపుల్ల దొరకలేదని డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆవేశంలో బలిదానాలు చేసుకున్నారు. ఈ పాపం మీది కాదా? అని అడుగుతున్నాను,” అని సీతక్క శాసనసభలో నిలదీస్తుంటే బిఆర్ఎస్‌ సభ్యులు జవాబు చెప్పలేకపోయారు.