మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడు తెలంగాణ శాసనసభ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ అధిష్టానం నాకు మంత్రి పదవి తప్పక ఇస్తానని హామీ ఇచ్చింది.
నేను హోమ్ మంత్రిగా ఉంటే రాష్ట్రంలో బిఆర్ఎస్ నేతలు పెట్రేగిపోకుండా నియంత్రించగలను. త్వరలోనే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత, జగదీష్ రెడ్డి అందరూ అవినీతి కేసులలో జైలుకి వెళ్ళడం ఖాయం,” అని అన్నారు.
అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఆయనకు మాజీ మంత్రి కేటీఆర్ ఎదురయ్యి పలకరించారు. “అన్నా మంత్రి పదవి లభిస్తుందని చెప్పావు కదా? ఇంకా ఎప్పుడు?” అని సరదాగా ప్రశ్నించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ, “నేను మంత్రి పదవి తీసుకుంటే మీలాగే మా పార్టీపై ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుంది,” అని సరదాగా జవాబు చెప్పారు.
మళ్ళీ కేటీఆర్ స్పందిస్తూ, “ఫ్యామిలీ పాలన కాదు... బాగా పనిచేస్తే మంచి పేరు వస్తుంది. ఇంతకీ ఈసారి ఎంపీగా మీ కుమార్తె కీర్తి పోటీ చేస్తుందా లేక కుమారుడు సంకీర్త్ పోటీ చేస్తాడా?” అని అడిగారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జవాబిస్తూ, “దయచేసి నన్ను వివాదాలలోకి లాగొద్దు. ఏదో మాట్లాడించి వివాదం సృష్టించొద్దు,” అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.