బీఏసీ మీటింగ్‌లో హరీష్ రావుకు చేదు అనుభవం

మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు ఈరోజు శాసనసభ స్పీకర్‌ కార్యాలయంలో చేదు అనుభవం ఎదురైంది. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగం ముగిసిన తర్వాత శాసనసభ బడ్జెట్‌ సమావేశాలలో చర్చించాల్సిన అంశాలు, పని దినాల గురించి చర్చించేందుకు స్పీకర్‌ కార్యాలయంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)మీటింగ్ జరిగింది. 

ఈ సమావేశానికి బిఆర్ఎస్ పార్టీ తరపున కేసీఆర్‌, కడియం శ్రీహరి హాజరవుతారని నిన్న స్పీకర్‌కు లిఖితపూర్వకంగా తెలియజేశారు. కానీ ఈరోజు కేసీఆర్‌కి బదులు హరీష్ రావు హాజరయ్యారు. 

ఇందుకు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అభ్యంతరం చెప్పారు. “పార్టీల తరపున ఎవరెవరు వస్తారని చెప్పారో వారే రావాలి తప్ప ఆ సమయానికి అందుబాటులో ఉన్నవారిని పంపించడం సరికాదు. బిఆర్ఎస్ పార్టీ సాంప్రదాయాన్ని గౌరవించాలి. కానీ కేసీఆర్‌కు బదులు హరీష్ రావు వచ్చారు. ఇది సరి కాదని చెప్పాము,”అని అన్నారు. 

దీంతో హరీష్ రావు సమావేశంలో పాల్గొనకుండా బయటకు వచ్చేశారు. బయట మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త కొత్త రూల్స్, సాంప్రదాయాలు ప్రవేశపెడుతోంది. బీఏసీ సమావేశానికి పార్టీల ప్రతినిధులు పాల్గొనడమే ముఖ్యం అని గ్రహిస్తే బాగుంటుంది. 

గవర్నర్‌ ప్రసంగంలో ఆరు గ్యారెంటీ పధకాల అమలు గురించి ఏమీ చెప్పలేదు. కొత్త ఆసరా పెన్షన్లు, రూ.500లకు గ్యాస్ సిలిండర్స్, నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, మహాలక్ష్మి పధకంలో మహిళలకు నెలకు రూ.2,500 పింఛన్ వంటివన్నీ ఇంకా ఎప్పుడు ఇస్తారో గవర్నర్‌ ప్రసంగంలో ప్రస్తావించనేలేదు,” అని హరీష్ రావు విమర్శించారు.