బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సిఎం రేవంత్ రెడ్డిపై కొన్ని విమర్శలు చేసి సూటి ప్రశ్నలు వేశారు.
బంజారాహిల్స్ తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ, “ఆనాడు మా ప్రభుత్వం మహేందర్ రెడ్డిని డీజిపిగా నియమిస్తే రేవంత్ రెడ్డే అభ్యంతరం చెప్పారు. ఆయనపై అవినీతి ఆరోపణలున్నాయని ఆ పదవికి అనర్హుడని, విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆయననే టిఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా ఎలా నియమించారు.
టిఎస్‌పీఎస్సీలో ఆంధ్రా వ్యక్తిని సభ్యుడుగా ఎలా నియమించారు? రాజకీయాలతో సంబంధం ఉన్నవారిని టిఎస్‌పీఎస్సీలో నియమించకూడదని వాదించిన మీరు, టిడిపిలో పనిచేసిన రజినీకుమారిని ఎలా నియమించారు? విద్యుత్ సంస్థలలో ఆంధ్రా అధికారులను డైరెక్టర్లుగా ఎందుకు నియమిస్తున్నారు? తెలంగాణలో అప్పుడే విద్యుత్ కోతలు మొదలైపోయాయి.
రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడే కనుక ఆయన డైరెక్షన్‌లో పనిచేస్తున్నట్లున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు లేకుండా చేసింది. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సింగరేణిలో నియమకాలు జరిగాయి. డిపెండెంట్ ఉద్యోగాలు కూడా కల్పించాము. కానీ రేవంత్ రెడ్డితో సహా మంత్రులు అందరూ నేటికీ అబద్దాలు చెపుతూ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారు,” అని కల్వకుంట్ల కవిత విమర్శించారు.