బీజేపీ కోసం బండి సంజయ్‌ ఆరాటమే కానీ కాపాడగలరా?

తెలంగాణ బీజేపీని రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా నిలిపి, శాసనసభ ఎన్నికలలో విజయం సాధించే స్థాయికి తీసుకువచ్చిన ఏకైక వ్యక్తి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌. కారణాలు ఏవైతేనేమి, బీజేపీ అధిష్టానం సరిగ్గా ఎన్నికలకు ముందు ఆయనను పదవిలో నుంచి తప్పించేసి కిషన్‌రెడ్డిని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా నియమించుకుని పార్టీ విజయావకాశాలను దెబ్బ తీసుకుంది. 

అందుకు బండి సంజయ్‌ చాలా బాధపడినప్పటికీ పార్టీ పట్ల, అధిష్టానం పట్ల నమ్మకం, గౌరవం ఉన్న కారణంగా ఆ అవమానాన్ని భరించి మళ్ళీ పార్టీ కోసం పనిచేశారు. కరీంనగర్‌ నుంచి శాసనసభ ఎన్నికలలో పోటీ చేశారు కానీ గంగుల కమలాకర్‌ చేతిలో ఓడిపోయారు. 

త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నందున బండి సంజయ్‌ మళ్ళీ పార్టీ తరపున ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నారు. ఈ నెల 10 నుంచి ప్రజాహిత యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించనున్నారు. తొలి విడతలో వేములవాడ, సిరిసిల్లా నియోజకవర్గాలలో 119 కిమీ పాదయాత్ర చేయబోతున్నారు. ముందుగా తన ఇష్ట దైవం కొండగట్టులో ఆంజనేయ స్వామికి పూజలు చేసి, అక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించనున్నారు.          

బీజేపీకి ఓ గొప్ప అవకాశంగా వచ్చిన శాసనసభ ఎన్నికలలో అధిష్టానమే పార్టీని నష్టపరుచుకుని తన విశ్వసనీయతను కూడా దెబ్బ తీసుకుంది. అయినా బండి సంజయ్‌ లోక్‌సభ ఎన్నికలలో బీజేపీని గెలిపించుకోవాలని తాపత్రయపడుతుండటం చాలా అభినందనీయమే. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పునాదులు పడిన తర్వాత బండి సంజయ్‌ ప్రయత్నాలు ఫలిస్తాయనుకోలేము. 

శాసనసభ ఎన్నికలలో ఓటమికి కాంగ్రెస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకునేందుకు కేసీఆర్‌ నేతృత్వంలో బిఆర్ఎస్ పార్టీ అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టింది. 

అలాగే కేసీఆర్‌ వలన తన ప్రభుత్వానికి ప్రమాదం పొంచి ఉంది కనుక లోక్‌సభ ఎన్నికలలో మరోసారి బిఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ తీయాలని సిఎం రేవంత్‌ రెడ్డి చాలా పట్టుదలతో ఉన్నారు. 

కనుక లోక్‌సభ ఎన్నికలలో ఆ రెండు పార్టీల మద్యనే ప్రధానంగా పోటీ ఉంటుంది. బండి సంజయ్‌ ఎంత ప్రయత్నించినా బీజేపీ మూడో స్థానంలోనే మిగిలిపోవచ్చు.