నీలోఫర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌, నీలోఫర్ ఆస్పత్రిలో బుధవారం సాయంత్రం చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులోని మైక్రోబయాలజీ ల్యాబ్‌లో ఉన్న ఫ్రిజ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగాయి.

పక్కనే రబ్బరు వస్తువులు ఉండటం వాటికీ మంటలు వ్యాపించడంతో ఆస్పత్రిలో దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. దీంతో ఆస్పత్రిలో రోగులు, వారి సహాయకులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు.

ఆస్పత్రి సిబ్బంది వెంటనే అగ్నిమాపక పరికరాలను ఉపయోగించి మంటలను ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మైక్రోబయాలజీ ల్యాబ్‌లో ఉన్న ఫ్రిజ్, కొన్ని వస్తువులు మంటలలో దగ్ధం అయ్యాయి. పెద్దగా ఆస్తి నష్టం జరుగలేదు. ఎవరికీ ఎటువంటి అపాయమూ కలగలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్ ఉషారాణి తెలిపారు.

గురువారం నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

గురువారం నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి, డెప్యూటీ ఛైర్మన్‌ బండ ప్రకాష్ శాసనసభ, పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణ రావు, డీజీపీ రవి గుప్త, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్లు హాజరయ్యారు.

సమావేశాలకు హాజరయ్యే మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలకు భద్రత, ప్రోటోకాల్, శాసనసభ బయట భద్రత తదితర అంశాలపై చర్చించారు.