తెలంగాణ ప్రజలకు ‘రాజన్న రాజ్యం’ నుంచి విముక్తి కల్పించిన వైఎస్ షర్మిల ఇప్పుడు ఏపీలో అన్న జగన్మోహన్ రెడ్డికి పక్కలో బల్లెంలా తయారయ్యారు.
గత శాసనసభ ఎన్నికల సమయంలో సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరో దారుణంగా హత్య చేస్తే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ దోషులను అరెస్ట్ చేయించలేదు. పైగా ఈ హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారు.
తండ్రికి న్యాయం జరగాలంటూ పోరాడుతున్న తనను వైసీపి సోషల్ మీడియా కాలాకేయ సైన్యంలా వేధించి వెంటాడుతోందని వివేకా కుమార్తె సునీతా రెడ్డి ఆరోపించారు.
ఇప్పుడు సొంత చెల్లెలు షర్మిల హటాత్తుగా ఏపీలోకి ఊడిపడటంతో త్వరలో జరుగబోయే ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో వైఎస్ షర్మిల వలన వైసీపి ఓడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. కనుక జగన్మోహన్ రెడ్డి తన మంత్రులు, ఎమ్మెల్యేల చేత చెల్లిపై కూడా తీవ్ర విమర్శలు ఆరోపణలు చేయిస్తున్నారు.
ఈ నేపధ్యంలో వైఎస్ షర్మిల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని టిడిపి నేత అయ్యన్నపాత్రుడు హెచ్చరించడంతో ఏపీలో కలకలం మొదలైంది. ఆమె కూడా ఇదే అనుమానంతో ఏపీ డీజీపీని కలిసి తనకు భద్రత పెంచమని వినతి పత్రం ఇచ్చారు. కానీ ఇంతవరకు కల్పించలేదు.
ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, “ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా, ప్రతిపక్ష నేతగా నేను ఆంద్రాలో విస్తృతంగా పర్యటించాల్సి ఉంటుంది. కనుక నాకు భద్రత కల్పించాలని కోరాను. కానీ కల్పించలేదు. అంటే నాకూ ఏదో జరగరానిది జరగాలనే ఈ ప్రభుత్వం (జగన్మోహన్ రెడ్డి) కోరుకుంటున్నట్లేగా?” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంటే బాబాయ్ వివేకాని లేపేసిన్నట్లు నన్ను లేపేస్తారా? అని ఆమె అడుగుతున్నారని అర్దమవుతూనే ఉంది. మరి అన్నయ్య ఏం చెప్తారో... ఏం చేస్తారో?