బిఆర్ఎస్‌తో యుద్ధానికి కాంగ్రెస్‌ కూడా సై!

కేసీఆర్‌ నేతృత్వంలో బిఆర్ఎస్‌ పార్టీ, కృష్ణా జలాలు, కృష్ణా ప్రాజెక్టులని అస్త్రాలుగా చేసుకుని లోక్‌సభ ఎన్నికలకు సిద్దమవుతుండటంతో, కాంగ్రెస్ పార్టీ కూడా వారిని ఎదుర్కునేందుకు అస్త్ర శాస్త్రాలతో సిద్దం అవుతోంది.    

మంగళవారం గాంధీ భవన్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ఎన్నికల కమిటీ సమావేశమైంది. దానిలోమంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు అందరూ పాల్గొన్నారు. 

వారిని ఉద్దేశ్యించి సిఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, “కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందనే విషయం మనం బయటపెట్టి విచారణకు ఆదేశిస్తున్నాము. మేడిగడ్డ బ్యారేజ్ క్రుంగిపోయి మన కళ్లెదుటే ఉంది. 

అభివృధ్ది పేరుతో కేసీఆర్‌ విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఊబిలో ముంచేశారని మనం శ్వేతపత్రాలతో బయటపెట్టాము. 

కనుక ప్రజల దృష్టిని వాటిపై నుంచి మళ్ళించేందుకే, కేసీఆర్‌ కృష్ణా జలాలు, కృష్ణా ప్రాజెక్టుల పేరుతో ప్రజలలో సెంటిమెంట్ రాజేసి లభ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారు. శాసనసభ ఎన్నికలలో కృష్ణా పరీవాహక ప్రాంతాలలో బిఆర్ఎస్‌ ఓడిపోయింది. కాంగ్రెస్‌ గెలిచింది. 

కనుక కేసీఆర్‌ దీంతో ప్రజలను రెచ్చగొట్టి నల్గొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబ్ నగర్‌, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్‌ జిల్లాలపై మళ్ళీ పట్టుసాధించి లోక్‌సభ ఎన్నికలలో ఆ సీట్లు గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. 

కనుక మనం కూడా ప్రతీ గ్రామానికి వెళ్ళి కేసీఆర్‌ ఆవినీతి, అక్రమాలు, అప్పులు, మేడిగడ్డ బ్యారేజి మొదలైనవన్నీ ప్రజలకు వివరించి, లోక్‌సభ ఎన్నికలలో కూడా బిఆర్ఎస్‌ పార్టీకి ఒక్క సీటు కూడా రానీయకుండా మనమే గెలుచుకునేందుకు గట్టిగా ప్రయత్నించాలి ఎన్నికలలో ఖచ్చితంగా గెలిచే అభ్యర్ధులనే ఎంపిక చేసి బరిలో దింపుతాము,” అని చెప్పారు.