తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ సుమారు మూడు నెలల తర్వాత నిన్న తొలిసారిగా తెలంగాణ భవన్‌కు వచ్చి పార్టీ నేతలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కృష్ణాగోదావరి నదీ జలాల్లో మన వాటా మనకు దక్కనందుకే ఆనాడు తెలంగాణ ఉద్యమాలు చేశాము. కానీ మనం పోరాడి సాధించుకున్న ఆ నీళ్ళను, కట్టుకున్న ప్రాజెక్టులను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం చేతికి అప్పగించేస్తోంది.
ఈ ముఖ్యమంత్రికి, మంత్రుల అనాలోచిత నిర్ణయం వలన తెలంగాణ రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో తెలీదు. దీని వలన రాబోయే రోజుల్లో కృష్ణా పరీవాహక ప్రాంతాలలో భూములకు నీళ్ళు అందక రైతులు వ్యవసాయం చేయలేని దుస్థితి ఏర్పడుతుంది.
ఇలాంటి పరిస్థితి రాకూడదనే ఆనాడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా నేను ప్రాజెక్టులను కెఆర్‌ఎంబీకి అప్పగించేందుకు అంగీకరించలేదు. అప్పగించాల్సిందేనని కేంద్రం బెదిరిస్తే, తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించుకోమని, నేను నా ప్రభుత్వాన్ని రద్దు చేస్తాను కానీ అంగీకరించనని నిష్కర్షగా చెప్పబట్టే కేంద్రం వెనక్కు తగ్గింది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచితంగా కేంద్రానికి అప్పగించేస్తోంది. ఈ నిర్ణయం వలన తెలంగాణ రాష్ట్రం, రైతులు నష్టపోతుంటే మనం చూస్తూ ఊరుకోము. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం మళ్ళీ పోరాడుదాం. ఈ నెల 13న నల్గొండ సభతో ఈ పోరాటాలకి శ్రీకారం చూడదాం,” అని కేసీఆర్ అన్నారు.
సిఎం రేవంత్ రెడ్డిని, మంత్రులను ఉద్దేశ్యించి, “ఈ ముఖ్యమంత్రి, మంత్రులకు దేనిపైనా అవగాహన లేకపోయినా నన్ను, బిఆర్ఎస్ పార్టీని రోజూ తిడుతున్నారు. వారి ఉడత బెదిరింపులకు నేను భయపడే ప్రసక్తే లేదు. నా రాజకీయ జీవితంలో ఇంతకంటే హేమాహేమీలనే ఎదుర్కొని పోరాడాను. పోరాటాలు నాకు, మన పార్టీకి కొత్తేమీ కాదు,” అని అన్నారు.
“రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కూల్చివేయక్కర లేదు. హామీలు అమలుచేయకపోతే ప్రజలే వారిని గద్దె దించేస్తారు. శాసనసభ ఎన్నికలు మళ్ళీ ఎప్పుడు జరిగినా మనమే అధికారంలోకి వస్తాము,” అని కేసీఆర్ అన్నారు.