పెద్దపల్లి బిఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ జంప్!

పెద్దపల్లి బిఆర్ఎస్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ తమ అధినేత కేసీఆర్‌కు షాక్ ఇచ్చారు. సిఎం రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ కార్యాలయంలో ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

త్వరలో లోక్‌సభ ఎన్నికలు, ప్రస్తుతం పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎంపీ వెంకటేష్ బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం కేసీఆర్‌కు పెద్ద ఎదురుదెబ్బే. ఎందుకంటే, ఆర్నెలలోగా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని, కేసీఆర్‌ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్‌, హరీష్ రావులు పదేపదే చెప్పుకొంటుండగా, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలే మా పార్టీకి క్యూకడతారని సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు చెప్పిన మాటే నిజమని దీంతో తేలింది కనుక! 

మూడు రోజుల క్రితమే బిఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కేసీఆర్‌ తీరుని తీవ్రంగా తప్పు పడుతూ పార్టీకి రాజీనామా చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దం అవుతుండటం గమనిస్తే, కూలేది కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదు... బిఆర్ఎస్‌ పార్టీ పరిస్థితే చాలా ప్రమాదంగా ఉందని స్పష్టమవుతోంది.