రాజకీయాలలో మళ్ళీ యాక్టివ్‌ కాబోతున్న కేసీఆర్‌

పదేళ్ళకు పైగా తెలంగాణ ఉద్యమాలతో, పదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాజకీయాలను శాసించిన మాజీ సిఎం కేసీఆర్‌కు శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓటమి ఓ పెద్ద షాక్. ఆ తర్వాత తుంటి ఎముక మార్పిడి  శస్త్ర చికిత్స చేయించుకున్న కారణంగా రెండు నెలలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇది రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలదొక్కుకునేందుకు అవకాశం కల్పించగా, బిఆర్ఎస్ పార్టీ ఆత్మరక్షణ ధోరణి అవలంబించాల్సి వచ్చింది. 

అయితే కేసీఆర్‌ ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో నేడు తెలంగాణ భవన్‌కు వచ్చి పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. 

కేసీఆర్‌ హయాంలోనే కృష్ణా జలాలను ఏపీకి దోచిపెట్టారని, అప్పుడే ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకి అప్పగించారంటూ సిఎం రేవంత్‌ రెడ్డి చేసిన తీవ్ర ఆరోపణలపై నేటి సమావేశంలో కేసీఆర్‌ పార్టీ నేతలకు వాస్తవాలు వివరించి, కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలను ఏవిధంగా ఎదుర్కోవాలో దిశా నిర్దేశం చేయనున్నారు. 

అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజి కుంగిపోవడం, ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించడంపై కూడా కేసీఆర్‌ పార్టీ నేతలకు వాస్తవాలు వివరించి, ఈ అంశంపై కాంగ్రెస్‌ నేతలను ఏవిధంగా ఎదుర్కోవాలో దిశానిర్దేశం చేయనున్నారు.

త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక వాటి గురించి కూడా చర్చించి, అభ్యర్ధుల ఎంపికపై నేడు చర్చించే అవకాశం ఉంది. త్వరలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. దానిలో తొలిసారిగా కేసీఆర్‌ పాల్గొనే అవకాశం ఉంది. ఆ సభ ఏర్పాట్ల గురించి కూడా నేటి సమావేశంలో చర్చించనున్నారు. కేసీఆర్‌ నేటి నుంచి తరచూ తెలంగాణ భవన్‌కు వస్తూ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.